Wed Mar 26 2025 18:20:33 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ కు ఇక తిరుగులేదా? ఎదురే లేకుండా పోయిందా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తనకు తిరుగు లేకుండా చేసుకుంటున్నట్లే కనిపిస్తుంది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తనకు తిరుగు లేకుండా చేసుకుంటున్నట్లే కనిపిస్తుంది. కనుచూపు మేరలో మరో నేత ఆయనకు పోటీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉన్న నలుగురైదుగురు సీనియర్ నేతలు సయితం రేవంత్ రెడ్డి ధాటికి తట్టుకోలేకపోతున్నట్లే కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. సిద్ధరామయ్యను తప్పించి డీకేను ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం అక్కడ జరుగుతుంది. కానీ తెలంగాణలో అలాంటి ప్రచారానికి కూడా తావులేకుండా గ్రౌండ్ వర్క్ ను ముందుగానే రేవంత్ చేసుకున్నట్లు కనిపిస్తుంది.
ఉత్తముడయినా...
రేవంత్ రెడ్డికి సరిసమానంగా పోటీ పడే నేత ఎవరూ కనిపించకుండా చేసుకున్నారు. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఉన్నా వారికి అధినాయకత్వం వద్ద ముఖ్యమంత్రి పదవిని చేపట్టేంత స్థాయిలేదన్న రీతిలో ఇప్పటికే కలరింగ్ వచ్చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసినా పార్టీని అధికారంలోకి తేలేకపోయారు. అది ఆయనకు మైనస్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధినాయకత్వం వద్ద మంచి మార్కులున్నప్పటికీ నాయకత్వంపై అనేక అనుమానాలున్నాయి. ఆయన సమర్ధతపై సందేహాల వల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రేసులో లేరన్నది నిజమని చెప్పుకోవాలి. ఇటీవల తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్వయంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చారు.
మల్లు కు పట్టున్నా...
ఇక మల్లుభట్టి విక్రమార్క కు మంచి మార్కులు ఉన్నప్పటికీ అందరినీ, కలుపుకుని పోయే నేత అయినప్పటికీ, పార్టీని విజయం వైపు నడిపించే శక్తి సామర్థ్యాలు లేవన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న విషయం. ఆయన వ్యక్తిత్వం మంచిదే. అవినీతి ముద్ర లేదు. వివాదరహితుడు. అయితే ప్రజలను ఆకట్టుకునేంత ప్రసంగాలు చేయలేకపోవడం ఆయన బలహీనత. ఆయనకున్నంతలో మధిర నియోజకవర్గం నేతగానే ఎక్కువగా చెలామణి అవుతారు. అంతే తప్ప రాష్ట్ర స్థాయి నేత కాలేరన్నది కాంగ్రెస్ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. అందుకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా రేవంత్ రెడ్డికి సరిసమాన స్థాయిలో లేకపోవడం రేవంత్ కు కలసి వచ్చినట్లుగానే కనిపిస్తుంది.
కోమటిరెడ్డి ఉన్నప్పటికీ...
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తొలి నుంచి పార్టీని నమ్ముకున్న నేత. దశాబ్దాల నుంచి పార్టీలోనే కొనసాగుతుండటం ఆయనకున్న ప్రత్యేకత. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన పార్టీ జెండాను వదిలిపెట్టలేదు. అయితే కోమటిరెడ్డి దూకుడు మనస్తత్వంతో పాటు ఆయన పదిమందిని ఆకట్టుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సయితం స్వయంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అందుకే ప్రచారం జరుగుతున్నట్లు రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. క్రౌడ్ పుల్లర్ గా కూడా ఆయనకు పేరుండటం, ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడం అదనపు బలం అని చెప్పక తప్పదు.
Next Story