Sun Dec 22 2024 22:49:46 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : రేవంత్ ఇక ఆగేట్లు లేరు.. హైడ్రా కు అన్ని పవర్స్...ఇక దూసుకెళ్లొచ్చు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనను సవాల్ గా తీసుకున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించడానికి రెడీ అయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనను సవాల్ గా తీసుకున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభించడానికి ఆయన రెడీ అయిపోతున్నారు. అందుకే హైడ్రాకు ఆయన అన్ని అధికారులు చట్టబద్ధంగా కట్టబెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం పది వేల భవనాలను ఖాళీ చేయించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లే కనపడుతుంది. హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతోనే రేవంత్ రెడ్డి నిన్న నేరుగా మీడియా సమావేశంలో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేశారు. తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు.
మూసీ పునరుజ్జీవానికి...
మీరు చెప్పినట్లే చేస్తానని ఒక పక్క అంటూనే మూసీ పునరుజ్జీవం చేయాల్సిందేనని ఆయన నొక్కి చెప్పడంతో ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనపడుతుంది. మూసీ ప్రాజెక్టు సుందరీకరణ చేపట్టడమే కాకుండా భవనాలు కోల్పోయిన వారందరికీ పరిహారం అదే స్థాయిలో ఇస్తామని ప్రకటించడం కూడా ఆయన వెనకడుగు వేయనని చెప్పడానికి ఒక కారణంగా చూడాలంటున్నారు. విపక్షాల నోళ్లు మూసివేయించేందుకే మరీ ఛాలెంజ్ లు విసిరారు. ప్రజల బాగోగుల కోసమే తాను చేస్తున్నానని చెప్పుకొచ్చారు. టూరిజం అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుందన్నారు. దీనికి తోడు హైదరాబాద్ పరిధిలో నాలుగో నగరం ఏర్పాటుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి గట్టిగా భావిస్తున్నట్లే కనిపిస్తుంది.
హైకోర్టు కూడా...
అందుకే ఆయన తగ్గేటట్లు కనిపించడం లేదు. హైకోర్టు కూడా హైడ్రాకు అనుకూలంగా తీర్పు చెప్పడం శుభపరిణామంగా భావిస్తున్నారు. మంచి ఆలోచనకు చేయూతనివ్వాలని, విమర్శలను పక్కన పెట్టి తనకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు. పదివేల ఇళ్లను ఖాళీ చేయించడం అంటే మాటలు కాదు. చాలా మంది ఇళ్ల యజమానులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్టే ఆర్డర్లు కూడా తెచ్చుకుని ఇళ్లకు తమకు కోర్టు ఆర్డర్ ఉందంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. అవన్నీ భారీ భవంతుల దగ్గర నుంచి పూరి ఇళ్ల వరకూ ఉన్నాయి. మరి ఏ ఇళ్లను కూలగొడతారో స్పష్టత లేదు కానీ త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
ముహూర్తం కోసమే...
పరిహారం కూడా భారీ స్థాయిలోనే వారికి ప్రకటించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారంటే మూసీ ప్రాజెక్టును ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి దీనిపై స్పష్టత ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. నోటీసులు ముందుగా ఇవ్వడం, కోర్టులను ఆశ్రయిస్తే వాటిని ఖాళీ చేయించడంతో పాటు నిర్వాసితులకు నచ్చ చెప్పేందుకు కూడా ప్రత్యేకంగా టీంలను రేవంత్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని ఆక్రమణలను తొలగించినా కొంత అసంతృప్తి తలెత్తినా, నగరంలో అత్యధిక శాతం మంది తమకు అండగా నిలుస్తారన్న అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నట్లుంది.అందుకే ముందుకే అడుగు వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ముహూర్తం ఎప్పుడనేది చూడాల్సి ఉంది.
Next Story