Sat Nov 23 2024 02:41:31 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేవంత్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది అందుకేనా? ఆ భయమే కారణమా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు మరికొందరు పార్టీలో చేరనున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు చేరికలను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. గతంలో కేసీఆర్ ఈ విధంగా చేర్చుకోబట్టే ఓటమిని మూటగట్టుకున్నారని, అయితే అదే ఫార్ములాను రేవంత్ ఎంచుకోవడంపై పార్టీలోని నేతల నుంచి అభ్యంతరాలు పెద్ద సంఖ్యలో వ్యక్తమవుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు.
అధినాయకత్వానికి నచ్చ చెప్పి...
కేసీఆర్ తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నాడు రేవంత్ రెడ్డి గ్రామాల్లోకి పార్టీ మారిని ఎమ్మెల్యేలను రానివ్వవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇప్పుడు అదే పని చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. అయితే ఇందుకు బలమైన కారణం మాత్రం ఉందని అంటున్నారు. నియోజకవర్గాల నేతలు అసంతృప్తికి గురయినా సరే ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారంటే అందుకు అధినాయకత్వాన్ని కూడా ఆయన ఒప్పించారని చెప్పవచ్చు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటీ మెజారిటీ మాత్రమే వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా ఉంది. బీఆర్ఎస్ కు సీట్లు బాగానే వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి కూడా ఎనిమిది స్థానాలు దక్కించుకుంది.
కాచక్కూర్చుని ఉండే...
అయితే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ ఎప్పుడూ కాచుకూర్చుంటుంది. ప్రభుత్వాన్ని పడదోసి అవసరమైతే కేసీఆర్ కు బయట నుంచి మద్దతు నిచ్చేందుకు కూడా బీజేపీ వెనకాడదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదనే బీజేపీ భావిస్తుంది. అందుకే కేసీఆర్ తో ఏ క్షణంలోనైనా చేతులు కలిపి, కాంగ్రెస్ నుంచి కొందరిని లాక్కుని ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆశ్చర్యం లేదు. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో ఖచ్చితంగా బీజేపీ ఆ పని చేయకుండా ఉండదన్న లెక్కల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్నే చీల్చి అధికారాన్ని దక్కించుకున్న చరిత్రను మరిచిపోకూడదని రేవంత్ అధినాయకత్వాన్ని చేరికలకు ఒప్పించినట్లు తెలిసింది.
అసంతృప్తి ఉన్నా...
అందుకే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయనకు చెప్పకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఎంఐఎంను విశ్వసించడానికి లేదు. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని ఆయన భావించి ఆపరేషన్ ఆకర్ష్ క తెరదీసినట్లు ఒక సీనియర్ నేత తెలిపారు. మామూలుగా అయితే ఇతర పార్టీలను కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశం ఉండేది కాదని, కానీ బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారంటున్నారు. పూర్తి కాలం కాంగ్రెస్ అధికారంలో ఉండేందుకే కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తుందని చెప్పడంలో కూడా నిజం లేకపోలేదు. ఆ వాదనను కూడా అంగీకరించాల్సిందే.
Next Story