Revnath Reddy : రేవంత్ ఎఫెన్స్ లో వెళుతున్నారా? రీజన్ ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్లు ఎఫెన్స్ లో వెళుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్లు ఎఫెన్స్ లో వెళుతున్నారు. రాజకీయంగా ఆయన నిలదొక్కుకునేందుకు ఉపయోగపడుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన మాట్లాడుతున్న మాటలు నేరుగా ప్రజలకు చేరువయ్యే అవకాశాలున్నాయి. ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లతో పాటు బీజేపీ నేత కిషన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి స్పీడ్ గా వెళుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో తాను ఏ విషయంపై చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసురుతున్నారు.
గత ఎన్నికల సమయంలో…
నిజానికి 2023 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని లైట్ గా తీసుకున్నారు. రేవంత్ ను ప్రజలు నమ్మే అవకాశం లేదన్న గులాబీ బాస్ అంచనాలు ఎన్నికల్లో తిరగబడ్డాయి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి వైపు జనం నిలబడ్డారు. దీనికి తోడు పార్టీ కూడా అదనపు బలంగా మారింది. ఫలితంగా పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ కు తొలిసారి ఓటమి ఎదురయింది. హైదరాబాద్ నగరం మినహాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎవరూ కారు పార్టీ వైపు చూడలేదు.
పంచ్ డైలాగులతో…
అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి సూటి మాటలేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. నేరుగా కేసీఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి నాడు చేసిన విమర్శలే పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి ఏళ్ల తరబడి నాన్చారని, వారి కుటుంబ సభ్యులకే రాజకీయ ఉద్యోగాలు దొరికాయని, అసలైన తెలంగాణ వాదులకు కొత్త రాష్ట్ర ఫలాలు దక్కలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అదేసమయంలో కేటీఆర్, హారీశ్ రావులను బిల్లా,రంగాలుగా అభివర్ణిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ కు దీటుగా…
నిజానికి కేసీఆర్ కు దీటుగా కాంగ్రెస్ లో మాట్లాడే నేతలు పెద్దగా లేరు. అనేక మంది సీనియర్ నేతలున్నప్పటికీ రేవంత్ రెడ్డి వేసే పంచ్ లు సులువుగా జనంలోకి వెళుతున్నాయి. రేవంత్ రెడ్డి కి కావాల్సింది అదే. తనపైన, పార్టీపైన చేసే ఆరోపణలకు సమాధానమిస్తూనే మరొక వైపు బీఆర్ఎస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న ప్రసంగాలు బాణాల్లా దూసుకెళుతుండటంతో క్యాడర్ లో కూడా ఉత్సాహం వెల్లివిరిసేలా చేస్తున్నట్లే కనపడుతుంది. ఎన్నికల ప్రచారం తరహాలోనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలకు పార్టీ కార్యకర్తలు ఫిదా అవుతున్నారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే. తన పదవితో పాటు పార్టీని పది కాలాల పాటు కాపాడుకావాలంటే ఎఫెన్స్ లో వెళ్లడమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లుంది.