Mon Dec 23 2024 15:23:45 GMT+0000 (Coordinated Universal Time)
Musi Project : జమిలీ ఎన్నికలు వస్తున్నాయి.. మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాల్సిందే
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.
మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వీలయినంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. సమీక్షలో అనేక విషయాలు అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుకు అవసరమైన అడ్డంకులేమిటి? వాటిని ఏ విధంగా అధిగమించాలి? న్యాయపరమైన చిక్కులతో పాటు నిర్వాసితులను ఏ విధంగా వారంతట వారే ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.
ఈ నెలలోనే టెండర్లు...
మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి నవంబరు నెలలో టెండర్లు ప్రారంభిస్తే వచ్చే ఏడాది నాటికి పనులు ప్రారంభం కావు. ఈలోపు జమిలి ఎన్నికలు 2027న వస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీలయినంత త్వరగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును మొదలు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకోసమే ఆయన అన్ని కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్వాసితులను అక్కడి నుంచి పంపించి వేయడానికి అవసరమైన చర్యల గురించి నేడు అధికారులతో సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. వారికి ఇష్టపూర్వకంగా వెళ్లేలా అవసరమైన పరిహారంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చేేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారు.
అవసరమైన పరిహారం...
పెద్ద భవనాలు అయితే భవనాన్ని తొలగించిన ప్రాంతానికి సమీపంలోనే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే మరో యాభై గజాలు అదనంగా ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. కూల్చిన భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది? అన్నది లెక్కలోకి తీసుకుని అందుకు తగినట్లుగా పరిహారంతో పాటు భూమిని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు న్యాయస్థానాల్లో నలుగుతున్న కేసుల విషయంపై కూడా నేడు అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. న్యాయపరంగా ఎదురవుతున్న అన్ని చిక్కులను తొలగించుకుని ఈ నెల నుంచి టెండర్లకు వెళ్లాలని ఈ సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.
Next Story