Sun Nov 17 2024 15:40:56 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : భయం భయంగా అధికారులు.. ఏం చేస్తారో బితుకుబితుకుమంటూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ డైరీ ఓపెన్ చేశారని చెబుతున్నారు. ఇప్పుడు అధికారులు భయపడిపోతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ డైరీ ఓపెన్ చేశారని చెబుతున్నారు. ఇప్పుడు అధికారులు బిక్కుబిక్కుమంటూ విధి నిర్వహణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొందరు అధికారులు తమ పోస్టులకు ఎసరు తప్పదని ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. అయితే తమంతట తాముగా తప్పుకునే వీలులేదు. ప్రభుత్వమే బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పులకు తమను బాధ్యులను చేస్తారేమోనన్న భయం మాత్రం అధికారుల్లో నెలకొని ఉంది. అందుకే బితుకుబితుకు మంటూ తమ కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు.
ఎన్నికల సమయంలోనే...
ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ డైరీ ప్రస్తావన తెచ్చారు. అప్పట్లో దానిని అధికారులు ఈజీగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కదా? అని నిమ్మళంగా ఉన్నారు. కానీ వాళ్లు ఊహించనది జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాకుండా రెడ్ డైరీ రాస్తున్నానన్న రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎన్నికల సమయంలో బహిరంగంగానే రెడ్ డైరీ గురించి రేవంత్ ను ప్రకటించారు. బీఆర్ఎస్ కు అడ్డంగా కొమ్ము కాస్తున్న అధికారుల పేర్లను తాను రెడ్ డైరీలో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.
ఎన్నికల కమిషన్కు కూడా....
అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రేవంత్ రెడ్డి కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. అప్పటి డీజీపీ అంజనీకుమార్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ వంటి అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీలకు ఎవరూ నిధులు ఇవ్వకుండా కొందరు అధికారులు పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరుపున వారే విరాళాలు వసూలు చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం కొందరి అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.
బదిలీతో సరిపెడతారా?
ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్తో అంటకాగిన అధికారుల్లో భయం పట్టుకుంది. దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు ఈ అధికారులు అప్పటి అధికార పార్టీకి అన్ని రకాలుగా సహకరించారన్న ఆరోపణలు స్వయంగా రేవంత్ రెడ్డి చేయడంతో ఇప్పుడు వారిపై ఎటువంటి చర్యలకు దిగుతారన్నది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ మాత్రం వారిని వదిలపెట్టే ప్రసక్తి లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉండరని కూడా అంటున్నారు. మరి ఈ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. బదిలీతో సరిపెడితే ఓకే.. అలా కాకుండా నాడు అవతవకలు జరిగాయంటూ తమను బాధ్యులను చేస్తే ఏం చేయాలన్న దానిపైనే భయంగా కాలం గడుపుతున్నారు.
Next Story