Mon Nov 25 2024 22:45:04 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : జగన్, కేసీఆర్ ల తీరు చూసి రేవంత్ రూటు మార్చారా? ఇక దబిడి దిబిడేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన పాలనపై సరిగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు మూడు నెలల పాటు కోడ్ అమలులో ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేవలం మూడు నెలలు మాత్రమే బాధ్యతలను నిర్వహించారనుకోవాలి. ఈలోపు మంత్రివర్గ విస్తరణ, పీసీీసీ చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తినటు హైదరాబాద్, హైదరాబాద్ టు హస్తినకు తిరగడటమే ఎక్కువ సమయం గడిచిపోయింది.
తన మార్క్ చూపేందుకు...
అయితే ప్రస్తుతం అన్నీ కొలిక్కివస్తున్న దశలో రేవంత్ రెడ్డి ఇక పాలనపై తన మార్క్ ను చూపేందుకు సిద్ధమయినట్లే కనపడుతుంది. కార్యదర్శులతో సమావేశమయిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ప్రతి నెల సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చామా? వెళ్లామా? అన్నట్లు ఉంటే కుదరదని తేల్చి చెప్పారు. పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని, లేని వారికి చర్యలు ఉంటాయని కూడా ఐఏఎస్ లకు హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడమే మానుకున్నారన్న ఆయన తాను కూడా ఇకపై ఆకస్మిత తనిఖీలను నిర్వహిస్తాననిచెప్పారు. ఫీల్డ్ విజిట్ చేస్తానని తెలిపారు.
పరుగు పెట్టించాలని...
ఆకస్మిక తనిఖీలతో జిల్లాలోని అధికారులను ఇక పరుగులు పెట్టించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆసుపత్రులు, విద్యాలయాలు వంటి వాటిని ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ నిర్ణయాలు భవిష్యత్ లో ఉండబోతాయని ఆయన మాటలను బట్టి అర్ధమవుతుంది. ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా రేవంత్ గట్టి నిర్ణయమే తీసుకున్నారు. అధికారులను కంట్రోల్ లో పెట్టాలంటే తాను నేరుగా రంగంలోకి దిగక తప్పదని ఆయన భావిస్తున్నారు. ఫీల్డ్ లెవెల్ లో కొంత తనకు అవగాహన ఉంటేనే చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చని ఆయన నమ్ముతున్నారు.
ఫలితాలు చూసిన తర్వాత...
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు జనానికి దూరమయినందునే వారు ఓటమిపాలయ్యారని, ఆ తప్పు తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లుంది రేవంత్ రెడ్డి. బహిరంగ సభలతోనూ, సంక్షేమ పథకాలతోనూ జనం మనసు చూరగొనలేమని ఎన్నికల ఫలితాలతో స్పష్టం కావడంతో జనానికి దగ్గరగా వెళ్లాలని రేవంత్ గట్టి నిర్ణయమే తీసుకున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ ముగిసిన తర్వాత ఇక ఆకస్మిక తనిఖీలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. చంద్రబాబు కూడా ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ.. జనంలో ఎక్కువ సమయం ఉన్నందున గెలిచారన్న లెక్కలతో రేవంత్ రూట్ మార్చారని అంటున్నారు.
Next Story