Thu Dec 19 2024 15:35:08 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : త్వరలోనే రైతు భరోసా.. అర్హులైన అందరికీ ఇస్తాం
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాంగ్రెస్ దేశంలో చేసిన సేవలకు ఉదాహరణే ప్రాజెక్టుల నిర్మాణమని తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా ఇచ్చిన మాట మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేయబోతున్నామని, నేడు మూడో విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టనున్నామని ఆయన చెప్పారు.
ప్రపంచ బ్యాంకుతో...
ఇటీవల తాము అమెరికాలో పర్యటించామని, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యామని, తక్కువ వడ్డీకే రుణాలను అందించేందుకు వారు అంగీకరించారన్నారు. గత ప్రభుత్వం తరహాలో తాము అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రభుత్వంపై భారం మోపబోమని ఆయన హామీ ఇచ్చారు. రుణమాఫీ సాంకేతిక కారణాలతో అందని వారిని గుర్తించి వారికి కూడా వర్తింప చేస్తామని తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచామన్న రేవంత రెడ్డి త్వరలోనే అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Next Story