Sun Dec 22 2024 10:25:45 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ డెసిషన్ కు ఫిదా అవుతున్న జనం...అదీ "దెబ్బ" అంటూ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు కనిపిస్తున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు కనిపిస్తున్నాయి. శభాష్ రేవంత్ రెడ్డి.. అదీ దెబ్బ అంటే అని కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? అందులో నిజాలను ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా అందులో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. ఒక ప్రాణం విలువను సినిమా టిక్కెట్ ను చించినట్లు చించి అవతలపడేయడం ఎంత వరకూ సమంజసం అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ లో హీరోలను, అందులోనూ మెగా కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే ఎంతో కొంత ధైర్యం కావాలి. మెగా ఫ్యాన్స్ ను రాజకీయంగా దూరం చేసుకోవడానికి కూడా ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత సాహసించరు.
ధైర్యం కావాలి...
కానీ రేవంత్ రెడ్డి మాత్రం అంతటి ధైర్యాన్ని ప్రదర్శించారు. రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తడం కాదు కానీ.. ఒక సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. టిక్కెట్ ధరలు భారీగా పెంచుకోవడానికి అంగీకరించిందీ ప్రభుత్వమే. కానీ అప్పుడు నిజానికి సినిమా హీరో ఏం చేయాలి? లేదా టాలీవుడ్ ఏం చేయాలి? ఒక పదకొండు గంటలు జైలులో అదీ న్యాయస్థానం రిమాండ్ విధిస్తే ఉండి వస్తే ప్రపంచమే మునిగిపోయినట్లు, ఇక ఎంతో అన్యాయం జరిగినట్లు అంతా ఒక్కటై అల్లువారి ఇంటికి పెద్దల నుంచి పిల్లల వరకూ క్యూ కట్టారు. సానుభూతి ప్రకటించారు. పదకొండు గంటలు జైలులో ఉండి వస్తేనే ఇంతటి సానుభూతి కనిపిస్తే, ఇక ప్రాణం పోయిన కుటుంబానికి కనీసం ఓదార్పు లేకపోవడం సిగ్గు చేటు కాదా? అన్న ప్రశ్నకు టాలీవుడ్ లో ఎవరైనా సమాధానం ఇస్తారా? అంటే అదీ లేదు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో....
సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తతడంతోనే అల్లు అరవింద్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. నిజానికి హీరో యిజం అంటే ఏంది? జనం వెంట నడవాలి. అంతే కాని జనాన్ని తొక్కుకుంటూ పరుగులు పెట్టడం కాదు. ఒక్క పుష్ష సినిమా బెనిఫిట్ షోతో జరిగిన మరణం ఇంతటితో ఆగిపోదు. డబ్బుల కోసం భవిష్యత్ లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ల పేరుతో ఫ్యాన్స్ ను ఎక్కడినుంచో రప్పించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ముద్దులు గాల్లో పెట్టేసి వెళ్లిపోతారు. కానీ దూర ప్రాంతం నుంచి బస్సుల్లో, లారీల్లో, వాహనాల్లో వచ్చి అనేక మంది ప్రమాదాల బారిన పడి మరణించినా వారికి పట్టదు. వారికి బాక్సాఫీస్ వద్ద కరెన్సీ నోట్లు కలెక్షన్ల రూపంలో కనిపించాలే తప్ప, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ఎవరు పట్టించుకోరు. ఒక స్టేట్ మెంట్ తో దులిపేసుకుపోవడం సినిమా ఇండ్రస్ట్రీలో సర్వసాధారణమయింది.
నిజమైన హీరో రేవంత్....
అందుకే రేవంత్ రెడ్డి అందులో ఏం తప్పులేదు. ఆయన నిజంగా మానవత్వంతో ఒక నేతగా జనం ముందు నిజమైన హీరోగా నిలిచాడనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ తో పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కోవడం అని ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి తన రాజకీయ భవిష్యత్ ను పక్కన పెట్టి ఆయన తీసుకున్న నిర్ణయం శభాష్ అని చెప్పాలి. ఎన్నిసార్లు ప్రశంసించినా సరిపోదు. ఆ గట్స్ కేవలం పాలిటిక్స్ లో కొందరికే ఉంటుంది. అటువంటి గుండె ధైర్యం ఉన్న నేతల్లో రేవంత్ ఒకరిగా నిలిచిపోతాడు. వెండితెర మీద చూసి ఎగిరి గంతేసే ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకూ అంతా రేవంత్ రెడ్డి వెంటే ఉంటారు. అందుకే ఇక బెన్ ఫిట్ షో ఉండవు.. ధరల పెంచము అన్న రేవంత్ నిర్ణయానికి యావత్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఫిదా అవుతున్నారు. శభాష్ రేవంత్.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story