Mon Apr 21 2025 00:35:48 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాలు ఏకమవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి

దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాలు ఏకమవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేరళలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని అన్నారు.
భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరిగిందని, దీని వల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా, కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. మన సంస్కృతితో సంబంధమున్న యూనివర్సిటీలకు కేంద్రమే వీసీలను నియమించేలా మార్పులు తెస్తున్నారని, ఇది మన సంస్కృతిపై దాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నర్సింహారావు, వల్లభ్భాయ్ పటేల్లు కాంగ్రెస్లో అనేక హోదాల్లో పనిచేశారు. వాళ్లు అసలుసిసలు కాంగ్రెస్ నేతలు. అలాంటి వారిని కాంగ్రెస్ వ్యతిరేకులుగా భారతీయ జనతా పార్టీ ముద్రవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
Next Story