Fri Dec 20 2024 11:16:11 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి అక్కడి నుండే పోటీ చేస్తారట..!
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే నియోజకవర్గం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే నియోజకవర్గం గురించి ఓ క్లారిటీ వచ్చింది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ నుంచే పోటీ చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి పోటీ చేయడానికి ఆయన పార్టీకి దరఖాస్తు చేయనున్నారు. తన తరపున కొడంగల్ లోని స్థానిక నేతలు దరఖాస్తు చేస్తారని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొడంగల్ కార్యకర్తల ద్వారా దరఖాస్తు ఇవ్వబోతున్నామని తెలిపారు. సోనియా ఆదేశాల మేరకు ఇది జరుగుతోందని.. కొడంగల్ అభివృద్ధే లక్ష్యంగా అక్కడి నుంచి పోటీ చేయాలని సోనియా చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీపీసీసీ చీఫ్ అయినా, సామాన్య కార్యకర్త అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కొడంగల్ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.
కేసీఆర్ ఓడిపోతున్నాడు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓటమి ఖాయమైంది కాబట్టే కేసీఆర్ ఆపద మొక్కులు మొక్కుతున్నారన్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోందని.. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందని, హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపించారు. కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ను దత్తత తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కొడంగల్లో కట్టిన గుడి, బడి అన్నీ తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమేనన్నారు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదన్నారు.
Next Story