Thu Dec 19 2024 19:15:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సీఎం అభ్యర్థి ఖరారు.. కీలక శాఖలనూ కేటాయించిన హైకమాండ్
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముగిసింది. ముఖ్యమంత్రి ఎవరో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముగిసింది. ముఖ్యమంత్రి ఎవరో హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రేవంత్ పేరును రాహుల్ గాంధీ ఖరారు చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లను కూడా హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ బలం పుంజుకుందని రాహుల్ తో పాటు అనేక మంది నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో పాటు గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్ పేరును సూచించడం కూడా ఆయన పేరుకు టిక్క్ పెట్టడానికి కారణమయిందని చెబుతున్నారు.
అప్పుడు కూడా...
నిజానికి 2021 నాటికి రేవంత్ పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలను చేపట్టేనాటికి పార్టీ పరిస్థితి బాగా లేదు. రేవంత్ ను అప్పుడు కూడా కొందరు నేతలు వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ అప్పుడు కూడా పట్టుబట్టి రేవంత్ ను చీఫ్ గా నియమించారు. ఎవరి వత్తిళ్లకు తలొగ్గకుండా రేవంత్ కు గో అహెడ్ అని సంకేతాలు ఇచ్చారు. దీంతో రేవంత్ కూడా దూకుడు ప్రదర్శించారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు యువత, మహిళలను ఆకట్టుకున్నాయని గుర్తించారు. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత గెలుపునకు రేవంత్ శ్రమ, వ్యూహంతో పాటు ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణమని హైకమాండ్ నమ్మినట్లు తెలుస్తోంది.
అవినీతి కేసులున్నాయని...
రేవంత్ పై అవినీతి కేసులున్నాయని, ముఖ్యంగా ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తెచ్చారు. రేవంత్ ను సీఎం చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికలలో పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని కూడా నేతలు కొందరు గుర్తుకు తెచ్చారు. అయినా రాహుల్ గాంధీ రేవంత్ పేరుకు ఓకే చేసినట్లు తెలిసింది. తాను తెలంగాణలో పర్యటించినప్పుడు, జరిగిన సభల్లో రేవంత్ కు ఉన్న క్రేజ్ తో పాటు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయనకున్న సన్నిహిత ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదనపు బలమయింది. అందుకోసమే రాహుల్ సీనియర్ నేతలకు నచ్చ చెప్పే పనిని కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ మీద ఉంచి తాను వెళ్లిపోయారు. బహుశ రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Next Story