Fri Apr 04 2025 22:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Congress : మీనాక్షీ నటరాజన్.. పాలిటిక్స్ లో సింగిల్ పీస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఆమె సింప్లిసిటీ, స్ట్రిక్ట్ గా ఉండే తత్వం గాంధీభవన్ లీడర్లను ఆశ్చర్యపడేలా చేస్తుంది. గతంలో ఎన్నడూ ఇలాంటి నేతను చూడలేదే అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పార్టీ ఇన్ ఛార్జులుగా వ్యవహరించిన వారు విమానాల్లో రాకపోకలు, స్టార్ హోటల్స్ లో బస. వారు హైదరాబాద్ వచ్చారంటే లక్షల్లోనే ఖర్చయ్యేది. రోజుకు కొన్ని లక్షలు పార్టీ ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ మీనాక్షి నటరాజన్ తొలిసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆమె వ్యవహరించిన తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి వారితో మాట్లాడాలన్నా, పైరవీలు చేయాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా భయమేననట్లుగా ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
ఉన్నత విద్య చదివి...
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఇండోర్ లో చదువుకుంటూనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. రాహుల్ గాంధీ సింప్లిసిటీని చూసి ఆమె కూడా అదే పార్టీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ విభాగమైన ఎన్.ఎస్.యూ.ఐ లో పనిచేశారు. తర్వాత 2008లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో మందసౌర్ నుంచి పోటీ చేసి మీనాక్షి నటరాజన్ విజయం సాధించారు. గతంలో 2024, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయి 2024 లో విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. రాహుల్ టీం లో ఒక సభ్యురాలిగా చేరారు. రాహుల్ గాంధీకి నమ్మకమైన నేతగా పేరుపొందారు.
రైలులో ప్రయాణం.. గెస్ట్ హౌస్ లోనే బస...
ఇక మీనాక్షి నటరాజన్ ఈరోజు హైదరాబాద్ కు రైలులోనే వచ్చారు. తన బ్యాగ్ ను తానే మోసుకుంటూ వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆమె సామగ్రిని తీసుకునే ప్రయత్నం చేసినా సున్నితంగా వారించారు. తనకు స్వాగతం పలకడానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని ఆమె చెప్పడంతో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగిన మీనాక్షి నటరాజన్ కు కేవలం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మరోఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే స్వాగతం పలికారు. ఎటువంటి హడావిడి లేకుండా ఆమె స్టార్ హోటల్ లో బస చేయకుండా సింపుల్ గా గెస్ట్ హౌస్ లోనే ఆమె బసచేశారు. తనకు కేటాయించిన వాహనంలోనే ఆమె గాంధీభవన్ కు చేరుకుని టీపీసీసీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు.
ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా...
తన రాక సందర్భంగా ఎలాంటి హంగు, ఆర్భాటాలు చేయవద్దని మీనాక్షి నటరాజన్ ముందుగానే సూచించారు. తన పేరిట ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని ముందుగానే నేతలను హెచ్చరించారు. అలాంటివి తనకు చిరాకు అని మొహంమీదనే చెప్పిన మీనాక్షి నటరాజన్ అంతే సింపుల్ గా ఆమె గాంధీభవన్ కుచేరుకున్నారు. కాంగ్రెస్ లో ఏమాత్రం బలహీనత కనిపించినా వెంటనే క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించక మానరు. రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ మీద నమ్మకంతోనే ఇక్కడు పంపారు. ఇక్కడ పార్టీని సెట్ చేయడానికి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులను ఎప్పటికప్పుడు టెన్ జన్ పథ్ కు అందించడానికే మీనాక్షి నటరాజన్ వచ్చినట్లు కనపడుతుంది.అందుకే కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ ముందు ఏ మాత్రం తోక జాడించినా వెంటనే కట్ చేస్తారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
Next Story