Mon Dec 23 2024 05:13:44 GMT+0000 (Coordinated Universal Time)
VH : వీహెచ్ కోసం ఆ పదవి ఎదురు చూస్తుందా? అందులో నిజమెంత?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కామ్ అయిపోయారు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కామ్ అయిపోయారు. ఆయన ఏదో ఆశించి తన పెదవులకు తాళం వేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రాజ్యసభ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయన ఇటీవల కాలంలో మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించడం లేదు. అలాగని సొంత పార్టీ నేతలను ఎవరినీ విమర్శించడం లేదు. ఎందుకంటే కె.కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొంది ఎన్నికలు జరిగితే తనకు అవకాశం దక్కుతుందన్న ఆశ ఆయనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
విమర్శలు మాత్రం...
వీహెచ్ అధికారంలో ఉన్నా లేకపోయినా విమర్శలను మాత్రం వదిలిపెట్టరు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన సొంత పార్టీనేతలపైనే విరుచుకుపడుతారు. అందుకు తరతమ బేధం లేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన పార్టీలో అసంతృప్తిగానే ముద్రపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీపై కూడా అప్పట్లో విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పీసీసీ చీఫ్ల అందరిపైనా ఆయన విమర్శలు చేశారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. తన అడ్డా అయిన అంబర్ పేట్ నియోజకవర్గంలో తన అనుచరుడికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన కూడా విమర్శలు చేశారు.
గాంధీ కుటుంబానికి...
తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కావాలని యాగీ యాగీ చేశారు. అయితే అధినాయకత్వం మాత్రం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో పార్టీలో పెద్దాయనకు తన పరిస్థితి అర్థమయినట్లుంది. తన నోరే తనకు చేటు తెస్తుందని గ్రహించినట్లుంది. కొన్నాళ్లుగా ఆయన మౌనంగా ఉండటానికి కారణం తనకు ఏదో ఒక పదవి వస్తుందన్న నమ్మకమే. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా వి.హనుమంతరావుకు పేరు. అలాగే బీసీ కార్డుతో ఆయన జనంలోకి బయలుదేరుతుంటారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పటికీ గెలవనప్పటికీ పలుమార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మరొక సారి తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఢిల్లీకి వెళ్లి...
ఇక ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ కూడా చేయడం మానేశారు. ఢిల్లీకి వెళ్లి తాను అగ్రనేతలను ఒప్పించగలిగినా, రాష్ట్ర నేతలు అడ్డుపడే అవకాశముందని భావించి ఆ ప్రయత్నాలను ఆయన విరమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తనకు పదవి గ్యారంటీ అని తొలి నాళ్లలో కొంత గంతులు వేసిన వీహెచ్ తన పరిస్థితి తనకు అర్థమయినట్లుంది. ఢిల్లీలోని అధినాయకత్వం కూడా తనకు నేరుగా హామీ ఇచ్చే అవకాశం లేదని బోధపడింది. అందుకే రాష్ట్ర స్థాయి నేతలనే కొంత ఆకట్టుకోగలిగితే ఏదో ఒక పదవి వస్తుందని పెద్దాయన భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన నోటికి తాళం వేసుకుని మరీ కూర్చున్నారు. మరి వీహెచ్కు పదవి వస్తుందా? రాదా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Next Story