ముగిసిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. షెడ్యూల్ గురించి ఏమన్నారంటే..
లంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఈసీ బృందం మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు . అయితే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇక రేపో మాపో విడుదల కానుంది. హైదరాబాద్లో మూడు రోజులున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తెలంగాణ ఎన్నికల సన్నద్ధతను నిశితంగా పరిశీలించారు.
రాజకీయ పార్టీలు, నిబంధనలను అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థలతో ఎన్నికల సంఘం హైదరాబాద్లో సమావేశమైంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఉచిత కానుకలు అందజేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా అనేక చర్యలు చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి రాకపోకలను పర్యవేక్షించేందుకు 148 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.