తెలంగాణలోని 8 జిల్లాలకు మావోయిస్టుల ముప్పు
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు భారీ ఎత్తున తెలంగాణకు వచ్చి చేరుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బలగాలను రంగంలోకి
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు భారీ ఎత్తున తెలంగాణకు వచ్చి చేరుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బలగాలను రంగంలోకి దింపింది కేంద్రం. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలోని 8 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 614 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను భారీ సంఖ్యలో రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల కమిషన్.
ముఖ్యంగా మావోయిస్ట్ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 614 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించింది ఈసీ. వీటిలో ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో కొందరు రాజకీయ నేతలకు మావోయిస్టులు వార్నింగ్ లెటర్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మావోయిస్ట్ కార్యకలాపాలు ఉండే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు జిల్లాలలో కేంద్రీకృతమై ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 100 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు తెలంగాణకు రాగా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశాస్త్ర సీమా బల్లకు చెందిన దాదాపు 7,500 మంది సాయుధ సిబ్బంది మోహరింపుకు సిద్ధంగా ఉన్నారు. ఏదీ ఏమైనా ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.