తలపండిన లీడర్‌కి తలనొప్పి తప్పలేదు
రాజకీయాలంటేనే ఓ సముద్రం లాంటిది. ఎప్పుడు ఏం జరగుతుందో తెలియని పరిస్థితి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, పొగడర్తలు
రాజకీయాలంటేనే ఓ సముద్రం లాంటిది. ఎప్పుడు ఏం జరగుతుందో తెలియని పరిస్థితి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, పొగడర్తలు, తిట్టుకోడాలు ఇలా ఒక్కటేమిటి రకరకాలుగా ఉంటాయి. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్న సామెత పాలమూరు పాలిటిక్స్‌కి సరిగ్గా సరిపోతుంది. తలపండిన లీడర్‌కి తలనొప్పి తప్పలేదు. అటుగాక..ఇటుగాక చివరకు ఆగమైపోయిన పెద్దాయన...హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇక తానూ నిత్యం విమర్శించే పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ..ఎవరా పెద్దమనిషి? వివరాల్లోకి వెళితే..
నాగం జనార్ధన్‌రెడ్డి.. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో పరిచయం అక్కర్లేని నాయకుడు. రాజకీయ కురువృద్దుడు. ఎదురులేని మనిషి..అజాత శత్రువు.. ఇలా ఎన్నో పేర్లు ఆయనకి. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో ఎదురులేని నాగం జనార్థన్‌రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బలమైన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడిగా పేరుగాంచిన నాగం జనార్ధన్ రెడ్డి గతమెంతో ఘనం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో రాజ్యమేలిన ముఖ్యనాయకుడు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహతుడు కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో ఆయన మాటకు తిరుగులేదు. పార్టీ నుంచి టికెట్ కావాలన్న, రాజకీయంగా ఎదగాలన్న నాగం ఆశీస్సులు ఉండాల్సిందే.
తెలంగాణ ఉద్యమం నాగం జనార్థన్‌రెడ్డిని తెలుగుదేశంపార్టీ నుంచి బయటకు వచ్చేలా చేసింది. సొంతంగా తెలంగాణ నగర సమితి పేరుతో పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్ళాడు నాగం. ఆ తర్వాత కొద్దిరోజులకే తన పార్టీని బీజేపీలో విలీనం చేసి అందులో చేరిపోయాడు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో ఎలాంటి పదవులు, బాధ్యతలు రాకపోవడంతో అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి పాలమూర్‌జిల్లాలో పలు ప్రాజెక్టులను సందర్శించి, అధికారపార్టీపై దుమ్మెత్తి పోశారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డిని ప్రాజెక్టు పనులు జరిగే నార్లాపూర్ దగ్గరకు వెళ్లి అక్కడి పరిస్థితులపై నిలదీసేశారు. ప్రాజెక్టుల్లో లోపాలపై కోర్టులో కేసులు వేశారు. ఉమ్మడిజిల్లాలోని పలు సమస్యలపై నాగం పోరాటం కొనసాగించారు. అధికారపార్టీని ప్రశ్నించే లీడర్‌గా ఎదిగిపోయారు.
నాగర్‌కర్నూలు నుంచి ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని కాంగ్రెస్ టికెట్‌ను ఆశించారు నాగం జనార్థన్‌రెడ్డి. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. దాంతో ఎన్నాళ్లుగానో పార్టీకోసం పనిచేస్తూ..అధికారపార్టీని ప్రశ్నిస్తూ ముప్పుతిప్పలు పెట్టిన నాగం జనార్థన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కష్టపడి పనిచేసే నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అధిష్ఠానాన్ని ఆయన సూటిగానే ప్రశ్నించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు నాగం. మారుతున్న పరిస్థితులను గమనిస్తూ..తనకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
నాగర్‌కర్నూలు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో అటు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు నాగం జనార్థన్‌రెడ్డి నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తీవ్ర అవమానం జరిగిందని వాపోయారు నాగం. త్వరలోనే తానూ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానన్నారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. అందులో టికెట్లు దక్కని వారు తీవ్ర అసంతృప్తికి గురై పక్క పార్టీల బాట పడుతున్నారు. అసంతృప్తులకు గురైన వారు ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సభలు, సమావేశాలు, చర్చలు ఇలా రకరకాలుగా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.