Wed Dec 25 2024 19:40:03 GMT+0000 (Coordinated Universal Time)
Konda Surekha : ఆవేశంతో .. ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు అనర్థదాయకమేగా?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. సినీసెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. రాయలేని, చెప్పలేని విషయాలను కొండా సురేఖ వెల్లడించి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారనడంలో సందేహం లేదు. నిన్నటి వరకూ కొండా సురేఖ పై ట్రోల్ చేసిన విషయంలో లభించిన సానుభూతి ఈ కామెంట్స్ తో ఒక్కసారిగా కొట్టుకుపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఫైర్ బ్రాండ్ లీడర్ గా...
నిజానికి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ లీడర్. ఆమె అందరినీ అన్నా అని సంభోదిస్తూ ఎంతో గౌరవంగా పలుకరిస్తుంటారు. కొండా సురేఖ రాజకీయ జీవితం ఆషామాషీగా ప్రారంభం కాలేదు. ఆమె కుటుంబం మావోయిస్టుల భావాజలం కలిగి ఉండటంతో కొండా సురేఖ నోటి నుంచి ఎప్పుడూ అసభ్యకరమైన పదాలు పెదవి దాటలేదు. మంత్రి పదవి కొండా సురేఖకు కొత్త కాదు. గతంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా ఎవరూ వేలెత్తి చూపరు. అలాంటి కొండా సురేఖపై కొందరు అలా ట్రోల్ చేయడం అనేది నిజంగా పిచ్చి చేష్టలకు పరాకాష్ట. కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.
చేజేతులా....
కొండా సురేఖ తనపై ట్రోల్ చేసిన విషయంలో వచ్చిన సానుభూతిని ఆమె చేజేతులా పోగొట్టుకున్నట్లయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాపైకి మళ్లాల్సిన వ్యతిరేకత కొండా సురేఖ తాను కొని తెచ్చుకున్నారు. మాట జారితే వెనక్కు తీసుకోలేం. అయితే కొండా సురేఖ దశాబ్దాల రాజకీయ జీవితం చూస్తే ఆమె కొంత ఆవేశంగా మాట్లాడతారు తప్పించి ఇలా అదుపు తప్పి ఎప్పుడూ మాట్లాడరు. కానీ కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో తాను మహిళగా తనపై జరిగిన ట్రోలింగ్ ను ఆమె తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయినా సరే ఆమె రాజకీయ జీవితంలో ఈ ఎపిసోడ్ ఒక మచ్చగానే మిగిలిపోతుందన్నది వాస్తవం. కొండా సురేఖ వెనువెంటనే తాను చేసిన తప్పును తెలుసుకుని చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడం ఒకింత స్వాగతించదగ్గదే.
Next Story