కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్, హరీశ్ రావు అటాక్
ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎన్నో అక్రమాలు చేస్తోందంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. అవినీతి, అసమర్థతకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని.. తాము ఎవరికీ బీ టీమ్ కాదని అన్నారు. కాంగ్రెస్సే భారత రాబందుల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్స్ అని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని, కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఒంటిచేత్తో ఢీకొట్టే సత్తా బీఆర్ఎస్ కు ఉందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని అన్నారు. వారి ప్రయత్నం మిస్ ఫైర్ అయి ముమ్మాటికీ కాంగ్రెస్సే కుప్పకూలుతుందని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి ప్రజల్లో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని కేటీఆర్ అన్నారు.