Mon Dec 23 2024 02:54:15 GMT+0000 (Coordinated Universal Time)
అందరినీ సంప్రదించాకే అభ్యర్థి ఎంపిక
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని అందరినీ సంప్రదించాకే ప్రకటించామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని అందరినీ సంప్రదించాకే ప్రకటించామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీకి ఐదు దశాబ్దాలు సేవలందించిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చామని తెలిపారు. అధికార పార్టీ ఇంత వరకూ అభ్యర్థిని ఎంపిక చేయకపోవడానికి కారణాలు అందరికీ తెలుసునని అన్నారు. అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే విభేదాలు తలెత్తుతాయని టీఆర్ఎస్ భయపడుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాము ప్రచారానికి సిద్ధమవుతున్నామన్నారు. ప్రతి మండలానికి ఇద్దరు నాయకులను ఇన్ఛార్జులుగా నియమించామన్నారు.
కుట్రలను బయటపెడతాం....
కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తమ ప్రచారంలో బయటపెడతామని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలకు చేసిన మోసాన్ని గురించి వివరిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడంతో పాటుగా పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ విధించిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే నిధులు వస్తాయని చెప్పారని, ఎవరికి నిధులు అందాయో అందరికీ తెలుసునని అన్నారు. కేసీఆర్ అరాచక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల కూడా పేదలు చనిపోతున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేయ్యడం ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ లకు గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కమ్యునిస్టు పార్టీ కార్యకర్తలు నేతలు మాట వినకుండా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయాలని, ఆత్మప్రభోదానుసారం కాంగ్రెస్ కు ఓటేయ్యాలని ఆయన కోరారు.
Next Story