Thu Nov 28 2024 16:45:39 GMT+0000 (Coordinated Universal Time)
నా సవాల్ కు సిద్ధమా?
హర్యానా తరహాలో ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
హర్యానా తరహాలో ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముత్యంపేటలో ఆయన మాట్లాడారు. పదిమందికి పని కల్పించి, పట్టెడన్నం పెట్టి ఆదుకుంటున్నారన్నారు. ఇక్కడి రైతులు గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంత రైతులు శ్రీమంతులని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలక పాత్ర పోషించారని, షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారన్న రేవంత్ రెడ్డి ఆత్మ గౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు.
చక్కెర ఫ్యాక్టరీని...
ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారని, చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. రైతుల ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే... తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని రేవంత్ అన్నారు. మూడు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? చక్కెర కర్మాగారాన్ని కూడా నడిపించలేని కేసీఆర్ రాష్ట్రాన్ని నడపలేరని అన్నారు. కేసీఆర్ కు ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి శంకరగిరి మాన్యాలు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
వ్యవసాయాన్ని...
ఈ ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ ప్రకటించారని, చెబుతున్న అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ పై కోపంతో బీజీపీ వైపు వెళ్లొద్దని, బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని అన్నారు.
చెరుకు రైతులను ఆదుకునేలా...
పది లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని ఎందుకు తెరవరని, రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా? అని నిలదీశారు. కేసీఆర్ అధికార మదాన్ని అణచివేయాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడి చట్టాలను మోడీ వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత రైతులదని తెలిపారు. మోదీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో రైతులంతా ఏకం కావాలని రేవంత్ పిలుపునిచ్చారన్నారు. రాజకీయ పార్టీల చుట్టూ తిరగనవసరం లేదని, ఏకమై పోరాడితే, రైతుల వెంటే రాజకీయ పార్టీలు వస్తాయన్నారు.
ఆరునెలల్లో తెరిపిస్తాం...
ఫ్యాక్టరీ ఎలా తెరుచుకోదో.. పసుపు బోర్డు ఎట్ల రాదో చూద్దామని సవాల్ విసిరారు. రైతుల పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకోసమే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త ప్రభుత్వంలో ఆరు నెలల్లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత తమదని రేవంత్ రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ మోడల్ పాలన అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 9వేలు ఆర్థిక సాయం అందిస్తోందని, వ్యవసాయ మంత్రి వస్తాడా, ఐటీ మంత్రి వస్తాడో మీ ఇష్టమని కాంగ్రెస్ పాలన... బీఆరెస్ పాలన పై చర్చ పెడదామని రేవంత్ సవాల్ విసిరారు.
Next Story