Mon Dec 23 2024 00:16:48 GMT+0000 (Coordinated Universal Time)
రెండు పార్టీల మధ్య వార్.. 17న ఏం జరగబోతోంది?
సెప్టెంబర్ 17 వచ్చేస్తోంది. ఈ తేదీ వస్తుందంటే తెలంగాణలో టెన్షన్ మొదలవుతుంది. ఈ టెన్షన్ జనాల్లో కాదు.. రాజకీయాలను చుట్టేస్తుంది..
సెప్టెంబర్ 17 వచ్చేస్తోంది. ఈ తేదీ వస్తుందంటే తెలంగాణలో టెన్షన్ మొదలవుతుంది. ఈ టెన్షన్ జనాల్లో కాదు.. రాజకీయాలను చుట్టేస్తుంది. ఈ రోజు ఏంటని అనుకుంటున్నారు అదే తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో భారీ ప్లాన్ చేస్తున్నాయి. భారీ సభలను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ వేదిక ద్వారా మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. ఈ 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోనే విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. గత సంవత్సరం పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే ఈ నెల 16న, 17 తేదీల్లో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17న భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించాలని భావించారు. దీని కోసం మూడు రోజుల క్రితమే రక్షణ శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే తాము ధరఖాస్తు చేసిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్ని తమకు అనుమతి లేకుండా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే విమోచన దినోత్సవం రోజు జెండా ఎగిరేది ఎవరిదనేది ఉత్కంఠగా నెలకొంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 16,17, 18 మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు ఇచ్చిందని, దీనిపై బుధవారం కేసీ వేణుగోపాల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. విమోచన దినోత్సవం పరేడ్ గ్రౌండ్లో 10లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నారని అన్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని రేవంత్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్ 2న డిఫెన్స్ అధికారులకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. తమకు అనుమతి లేకుండా ప్రభుత్వమే కుట్ర పన్నడం దారుణమని అన్నారు. ఏదీ ఏమైనా ఈ కార్యక్రమం వాయిదా వేసేది లేదంటూ స్పష్టం చేశారు.
Next Story