Mon Dec 23 2024 11:17:12 GMT+0000 (Coordinated Universal Time)
కళకళలాడుతున్న గోదావరి బేసిన్ జలాశయాలు
గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు
శ్రీరామసాగర్, నిజాంసాగర్ లకు పెరిగిన వరద
రైతన్నల పాలిట వరంగా మారిన వర్షాలు
జోరుగా వ్యవసాయ పనులు
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి బేసిన్ ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ధాటికి గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పొలం పనులు ప్రారంభించే సమయంలో వర్షాలు పడుతుండటంతో రైతన్న ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా వరినాట్లు వేసేటపుడు వర్షాలు పడుతుండటంతో.. పంటకు సరైన స్థాయిలో నీరు అందుతుందో లేదోనన్న ఆందోళన తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరినాట్ల పనులు ఊపందుకున్నాయి.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(SRSP)కు 1,21,008 ఇన్ ఫ్లో ఉండగా... 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను, 63.47 టీఎంసీలు నిల్వఉన్నాయి. ఇప్పటికే నిండిన నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22.440 క్యూసెక్కుల వరద వస్తోంది.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద వస్తుండగా, 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.48 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తోంది. 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్ధాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు 21.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్ధాయి సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 11.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 63.47 టీఎంసీల నీరు నిల్వఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్ధాయి సామర్థ్యం 90.31 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్ధాయి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.01 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు రిజర్వాయర్ లో పూర్తిస్థాయి సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 12.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం.. 27.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Next Story