ప్రాజెక్టులకు జలకళ.. ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి
ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు చేరితే.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తామని..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరికి భారీఎత్తున వరద నీరు వస్తుండటంతో.. భద్రాచలం వద్ద నది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుతం 42 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు చేరితే.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తామని అధికారులు తెలిపారు. గోదావరికి వరద తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలో 5 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే.. మొదటిప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.