Mon Dec 23 2024 10:31:07 GMT+0000 (Coordinated Universal Time)
వర్షాలు తగ్గుతాయట
తెలంగాణ వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడిందని, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు లేనట్లేనని అన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని అన్నారు. తెలంగాణలో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదయ్యాయని అన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని, అయితే ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం జిల్లాలలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దసంఖ్యలో చెరువులు, రోడ్లు తెగిపోయి, వందలాది గ్రామాలతోపాటు పట్టణాల్లోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షం కురిసింది. గ్రేటర్ వరంగల్లో పలు కాలనీలు నీటమునిగాయి. అధికారులు ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. కాజీపేట రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. వరంగల్ హంటర్ రోడ్ ఖమ్మం బ్రిడ్జి జంక్షన్లోని జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రెండ్రోజులుగా చిక్కుకుని ఉన్న 280 మంది విద్యార్థులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు రక్షించాయి.
Next Story