Mon Dec 23 2024 19:24:59 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా?
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మహిళ షర్మిల అని ఆయన అన్నారు. ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు షర్మిల మాట్లాడుతుందా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు. హైదరాబాద్ పోవాలంటే పాస్ పోర్టు తీసుకోవాలా? అని వైఎస్ ప్రశ్నించిన విషయాన్ని బాల్క సుమన్ గుర్తు చేశారు. తెలంగాణలో షర్మిల సుద్దులు చెబితే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం గురించి ఆమెకు ఏం తెలుసునని ప్రశ్నించారు.
తెలంగాణ వ్యతిరేకి...
వైఎస్ షర్మిల నోటికి హద్దూ పద్దూ లేకుండా పోతుందన్నారు. షర్మిల కూడా తెలంగాణను చాలాసార్లు వ్యతిరేకించారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పాదయాత్రలో ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని అన్నారు. కేసీఆర్ పట్ల కూడా సంస్కార హీనంగా మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎలా బడితే అలా మాట్లాడితే ఊరుకోరని అన్నారు. తెలంగాణ వ్యతిరేకి ఈ గడ్డమీద అలా మాట్లాడుతుంటే సహించరని బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కిరాయి మూకలతో పర్యటిస్తూ డ్రామాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ తోలుబొమ్మలాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాల్క సుమన్ అన్నారు.
Next Story