Tue Nov 05 2024 15:27:32 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు మళ్లీ వడగండ్ల వర్ష సూచన.. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తాజాగా మరోసారి రాష్ట్రానికి వడగండ్ల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా.. వేసవి కాలంలో అకాల వర్షాలు పడుతున్నాయి. పగలంతా మాడు పగిలే ఎండతో ఉక్కపోతగా ఉంటుంటే.. సాయంత్రం అయ్యేసిరికి పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి భారీ వర్షం కురుస్తోంది. నిన్న కూడా తెలంగాణలోని హైదరాబాద్ వాసులు ఇలాంటి వాతావరణ పరిస్థితినీ చూశారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రాన్ని వడగండ్లు వణింకించిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి రాష్ట్రానికి వడగండ్ల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వడగండ్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాటితో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా విచే అవకాశాలున్నట్లు పేర్కొంది. వడగండ్ల వర్షసూచన నేపథ్యంలో రైతులు పంటలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తడిసిముద్దైన భాగ్యనగరం
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ఉక్కపోత నుండి కాస్త ఉపశమనం కలిగించింది. సైదాబాద్, అంబర్ పేట, కాచిగూడ, ఉప్పల్, మల్లాపూర్, నల్లకుంట, లాలాపేట్, నాచారం, హబ్సిగూడ, గోషా మహల్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, సుల్తాన్ బజార్, రామ్ నగర్, గాంధీనగర్, ముషీరాబాద్, విద్యానగర్, దోమలగూడ, అడిక్ మెట్, చిలకలగూడ, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, ప్యారడైజ్, వారాసిగూడ, రామ్ గోపాలపేట, భన్సీలాల్ పేట, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉత్తరాది వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వివరించింది.
Next Story