Mon Dec 23 2024 15:12:37 GMT+0000 (Coordinated Universal Time)
Padmasri : ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన ప్రతిభ.. నిరుపేదలైనా కళలనే నమ్ముకుని నేడు పురస్కారానికి
పద్మశ్రీ కి ఎంపికైన తెలుగు వాళ్లు పేదరికంలో పుట్టినా తమ రంగాల్లో నిష్ణాతులుగా మారారు. ఆ యా రంగాల్లో గుర్తింపు పొందారు
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మనోళ్లు పేదరికంలో పుట్టినా తమ రంగాల్లో నిష్ణాతులుగా మారారు. వివిధ కళల్లో గుర్పింపు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వరి పుట్టింది ఆంధప్రదేశ్ లో.. పెరిగింది తెలంగాణలో. మచిలీట్నంలోని ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో ఆమె పుట్టారు. హరికధ అంటే చిన్నప్పుటి నుంచే ఆసక్తి ఉన్న ఉమామహేశ్వరి తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడంతో సహజంగానే కళల పట్ల ఉత్సుకత పెరిగింది. ఆయన వేములవాడ దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ముప్పయి ఏళ్లకు పైగా పని చేశారు. పదో తరగతి వరకూ చదివిన ఉమామహేశ్వరి సంగీతంపై ఉన్న ఆసక్తితో హరికధ నేర్చుకోవాలని భావించి అందులో శిక్షణ పొందారు. రుక్మిణి కల్యాణం హరికధా గానంతో తొలి ప్రదర్శన ఇచ్చిన ఉమామహేశ్వరి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. హరికధకు దక్కిన గౌరవంగా ఆమె తెలిపారు.
చిందు యక్షగానంలో...
మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య చిందు యక్షగానంలో పేరు గడించారు. గడ్డం సమ్మయ్య జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సమ్మయ్య తండ్రి నుంచే ఈ కళను అందిపుచ్చుకుని అందులోనే నిష్ణాతులయ్యారు. ఐదో తరగతి మాత్రమే చదివిన సమ్మయ్య తన 12వ ఏట నుంచే రంగస్థలంపై అడుగు పెట్టారు. తర్వాత చిందు యక్షగానంతో అలరించారు. ఆయన సామాజిక అంశాలతో ప్రచారం నిర్వహించారు. ఇటీవల అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామాయణ గాధకు సంబంధించి యక్షగాన ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
వీణ వాయించారంటే...?
దాసరి కొండప్ప నారాయణపేట జిల్లాకు చెందిన దామరగిద్ద. ఆయన బుర్రవీణ వాయిద్య కళాకారుడిగా ప్రసిద్ధి. అనేక పాటలను గానం చేసిన కొండప్ప అందరికీ సుపరిచితులే. జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. పురాణ కథలను పాటల రూపంలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పటంలో కొండప్ప దిట్ట. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర నాటకాలను పాటలతో చెప్పడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. తాను వాయించే బుర్ర వీణను ఆయనే తయారు చేసుకుంటారు. ఇటీవల బలగం సినిమాలోనూ ఆయన పాట పాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన కొండప్పకు పద్మశ్రీ అవార్డు లభించింది.
ఎందరికో ఆదర్శం...
కూరెళ్ల విఠలాచార్య అంటే పుస్తకాల పురుగు. ఆయనది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం వెల్లంకి. ఆయనకు పుస్తకాలంటే పిచ్చి. ఏ పుస్తకం కనిపించినా వదలకుండా తన ఇంటికి చేరుస్తారు. ఆయన ఇల్లు ఒక లైబ్రరీలా ఉంటుంది. 2014లో ఆయన తన ఇంటిని గ్రంధాలయంగా మార్చారు. ఆయన కవి కూడా. ఆయన దాదాపు రెండు లక్షల పుస్తకాలను సమకూర్చి తన లైబ్రరీలో పెట్టారు. ఎంతో మంది విద్యార్థులకు ఈయన ఇల్లు ఒక వరంలా మారింది. ఇక్కడ చదివి పీహెచ్డీ చేసేందుకు ఉపయోగపడింది. ఈయన అనేక పురస్కారాలను అందుకున్నారు.
ఆలయ స్థపతిగా...
వేలు ఆనందాచారి.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో పుట్టారు. అనంతరం ఆయన హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్నారు. 1980లో దేవాదాయ శాఖ పనిచేసిన వేలు ఆనందా చారి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రముఖ దేవాలయాలలో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఊరికే కూర్చోలేదు. శ్రీశైల దేవస్థానంలో ఆయన ఆస్థాన స్థపతిగా ఉన్నారు. యాదాద్రి పునర్మిర్మాణ పనుల్లోనూ ఈయన సేవలందించారు. శిల్ప కళారంగంలో ఈయన అందెవేసిన చేయి. అందుకే ఈయనను యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ప్రధాన స్థపతిగా నియమించింది. శిల్పకళా విభాగంలో ఈయనకు పద్మశ్రీ పుర్స్కారం లభించింది
తండాలో పుట్టి...
కేతావత్ సోమ్లాల్ కు పద్మశ్రీ అవార్డు ఊరికే దక్కలేదు. ఆయన చేసిన శ్రమకు దక్కిన ఫలితం. బంజారా భాషలో ఆయన భగవద్గీతను అనువదించారు. ఇందుకు దాదాపు పదహారు నెలల పాటు శ్రమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ తన జాతి కోసం అనేక పాటలు కూడా రచించారు. 2014లో ఈయన రచించిన భగవద్గీతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ఆయనకు ఈ పురస్కారం లభించడం సముచితం అన్నది అందరూ అనే మాట. ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా మారి పురస్కారాలకు ఎంపిక య్యారు.
Next Story