Sun Mar 30 2025 00:48:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కాంగ్రెస్ ఓడిందా? బీజేపీ గెలిచిందా? అసలేం జరిగింది?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా అందులో రెండింటిలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఇది తమ బలం పెరుగుతుందని బీజేపీ భావిస్తుంది. కానీ అది బలం కాదు వాపు మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సహజంగా బీఆర్ఎస్ సానుభూతి పరులు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు మొగ్గు చూపారంటున్నారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కావడంతోనే ఈ ఎన్నికల్లో గెలుపు దక్కిందని గట్టిగా చెబుతున్నారు.
కమలనాధులు...
ముక్కోణపు పోటీ జరగలేదని, అదే జరిగి ఉంటే విజయం తమకే దక్కేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అంటే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉన్నారని, రానున్న కాలం బీజేపీదేనని కమలనాధులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు గెలిచిన తాము పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ కు ధీటుగా స్థానాలను సాధించామని కమలనాధులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటూ గట్టి ధీమాగా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, అందుకే తమను గెలిపించాలని కాషాయపార్టీ నేతలు కోరుతున్నారు.
కాంగ్రెస్ మాత్రం...
మరొక వైపు కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచన చేస్తుంది. తెలంగాణ ప్రజలు వరసగా రెండు సార్లు అధికారాన్ని ఇవ్వడం సంప్రదాయంగా వస్తుందని, మరొకసారి కూడా కాంగ్రెస్ దే అధికారమని ఢంకా భజాయించి చెబుతున్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న తీరు, జనంతో మమైకమవుతున్న వైనం వంటి విషయాలు తమను విజయానికి మరింత దగ్గర చేరుస్తాయని అంటున్నారు. అందుకే రెండు పార్టీలు కలిసి పరోక్షంగా పోటీ చేసిన ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించవని చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారివిగా కనిపిస్తున్నాయి.
Next Story