Mon Nov 18 2024 23:22:49 GMT+0000 (Coordinated Universal Time)
జోడు పదవులు... లక్ కాక మరేంటి?
కేంద్ర మంత్రిగానూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం కొనసాగించే అవకాశముంది
భారతీయ జనతా పార్టీలో జోడు పదవులు అనేది కష్టం. ఏదో ఒక పదవినే ఉంచుతారు. అది మంత్రి పదవి అయినా.. పార్టీ పదవి అయినా ఒకరికి ఒకే పదవి అన్నది పార్టీ సిద్ధాంతం. కానీ తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కిషన్ రెడ్డికి లక్ తన్నుకుంటూ కలసి వచ్చిందనే చెప్పాలి. కిషన్ రెడ్డి జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. బీజేపీలో ఇది అరుదైన ఘటనగా చెప్పుకోవాలన్నది పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒకరిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే.. అతనికి పార్టీ బాధ్యతలను అప్పగిస్తారు.
బండి సంజయ్ స్థానంలో...
తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పదవీ కాలం పూర్తి కావడంతో ఆయనను ఎన్నికల వరకూ కొనసాగిస్తారని భావించారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా సమయంలో పార్టీ పరుగులు తీసింది. పాదయాత్రలతో బీజేపీని ఒకింత బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేశారు. నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ స్పీడ్ ను పెంచారు. అయితే అధినాయకత్వం మాత్రం స్థానిక పరిస్థితులను అనుసరించి బండి సంజయ్ను మార్చి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి...
కిషన్ రెడ్డిని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆయన కేంద్ర మంత్రి పదవిపై చర్చ జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరిగింది. మొన్న పార్లమెంటు సమావేశాల కంటే ముందు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అనుకున్నారు. ఈ సందర్భంగానే కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని అన్నారు.
కొనసాగింపుకే....
ఈ స్థానంలో బండి సంజయ్ ను కేంద్ర మంత్రిగా నియమిస్తారని భావించారు. అయితే ఆయనకు పార్టీ పదవి ఇవ్వడంతో ఇక మంత్రి పదవి ఇవ్వరు. కిషన్ రెడ్డిని కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర పదవి ఇచ్చి వివాదాలు తెచ్చుకోవడం ఎందుకని కిషన్ రెడ్డినే కొనసాగించే వీలుందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద జోడు పదవుల్లో కిషన్ రెడ్డి ఎన్నికల వరకూ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మంత్రి వర్గ విస్తరణ జరిగితే చెప్పలేం కాని ప్రస్తుతానికయితే కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగానూ, ఇటు పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగనున్నారు.
Next Story