Tue Apr 08 2025 07:15:48 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : శ్రమ తప్ప ఫలితం జీరో గానే మిగలక తప్పదా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలకు ముగింపు పడటం లేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలకు ముగింపు పడటం లేదు. ఈరోజుకు సహాయక చర్యలు నలభై మూడో రోజుకు చేరాయి. మృతి చెంది ఉంటారని భావిస్తున్న ఆరుగురి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు. అయితే వారి శ్రమకు తగిన ఫలితం కనిపించడం లేదు. ఇంత సుదీర్షమైన రెస్క్కూ ఆపరేషన్ ఎక్కడా జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మృతదేహాలు లభ్యమవుతాయన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని టీంలు వచ్చినా చివరకు ఫలితం జీరో గానే కనపడుతుంది.
కార్మికుల కుటుంబాలు...
తప్పిపోయిన కార్మికుల కుటుంబాలు కూడా ఆశలు వదిలేసుకున్నట్లే కనపడుతుంది. చివరకు తమ వారి డెడ్ బాడీలకు సంబంధించి ఆనవాళ్లు లభించినా చాలు అన్న స్థితికి వారు వచ్చారు. కార్మికులు తప్పిపోయి దాదాపు నెలన్నర కావస్తుండటంతో ఇక రోజురోజుకూ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయి ఉంటాయని, అవశేషాలను తీసుకుని రోదించడం కంటే వారు ఇంకా ఉండి ఉంటారన్న ఆశలు ఎప్పుడో పోయాయని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మృతదేహాలు దొరికే అవకాశం లేదన్న అభిప్రాయానికి వచ్చింది.
చివర వరకూ ప్రయత్నం...
అయితే చివర వరకూ ప్రయత్నం చేయాలన్న లక్ష్యంతో సహాయక బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో పాటు నీరు ఉబికి వస్తుండటం కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారుతుండటం కూడా ఇబ్బందికరంగా మారింది. తవ్వకాలు జరిపే ప్రాంతంలో ప్రమాదమని తెలిసి అక్కడకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టన్నెల్ లో కొంత వరకే సహాయక బృందాలు వెళుతున్నాయి. డీ1, డీ2 ప్రాంతాల వద్దకు మాత్రం వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. మరికొన్ని రోజులు బురదను తొలగిస్తే తప్ప తవ్వకాలు జరపడంపై పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
Next Story