Mon Mar 24 2025 12:57:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సెంటిమెంట్ తో తొలి అడుగు వేస్తున్న కేసీఆర్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దబిడే
తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడంలో కేసీఆర్ కు మించిన నేత మరొకరు ఉండరు

తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడంలో కేసీఆర్ కు మించిన నేత మరొకరు ఉండరు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం సాధించిన క్రెడిట్ ను ఆయన ఖాతాలో వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందుకే వరసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం పదేళ్ల పాటు తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఆ పార్టీ తేరుకోనూ కూడా లేకపోయింది ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఎన్నికల నాటికి పార్టీని విజయం వైపు తీసుకెళ్లడంలో కేసీఆర్ కు మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన వ్యూహాలన్నీ సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంటాయి.
దోచుకోవడానికి...
అయితే గత ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్న కేసీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆయన అన్నారు. తెలంగాణను దోచుకోవడానికే అందరూ ఇప్పుడు ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్నది చాలక, మళ్లీ ఒకసారి దండెత్తి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, కానీ తెలంగాణ ప్రజలు అలా వచ్చిన వారిని తన్ని తరిమేయాలని, అందుకు అవకాశమిచ్చిన వారిని కూడా క్షమించకూడదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.
మరోసారి బీఆర్ఎస్ దే అధికారం...
మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ గత పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు దోచుకోవడానికి కొందరు వస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి గెలవడం ఖాయమని తెలిపారు. తిరిగి తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడానికి చేస్తున్న సన్నాహాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు విజయంపై కూడా నేరుగా విమర్శలు చేశారు. మరొకసారి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి బీఆర్ఎస్ కు మరింత హైప్ తెచ్చేందుకు కేసీఆర్ వేస్తున్న తొలి ఎత్తులో ఇది ముందడుగు మాత్రమేనని అంటున్నారు. రానున్న కాలంలో మరింతగా సెంటిమెంట్ ను రగిలించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story