Wed Apr 23 2025 04:40:28 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : ఈసారి వేసవి ముందే వచ్చింది.. లేటుగానే వెళుతుందట
ఈ ఏడాది వేసవి ముందుగానే వచ్చింది. అదే సమయంలో ఆలస్యంగానే ఎండలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

ఈ ఏడాది వేసవి ముందుగానే వచ్చింది. అదే సమయంలో ఆలస్యంగానే ఎండలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత ముదురుతాయని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు ఈ ఏడాది గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. సెగ గాలులు కూడా ఫిబ్రవరి నెలలో ప్రారంభం కావడంతో ఇక మే నెలలో ఎండలు మామూలుగా ఉండవన్నది వాతావరణ శాఖ అధికారుల అంచనాగా వినిపిస్తుంది.
మార్చి 15వ తేదీ నుంచి...
మార్చి 15వ తేదీనుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు పెట్టుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలకు జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, తీవ్రమైన జలుబు వంటి రోగాలు సంక్రమించే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం పది గంటల నుంచి రోడ్లపైకి ఎవరూ రావడం లేదు. విధుల్లోకి వెళ్లే వారు మాత్రం ఉదయాన్నే బయలుదేరి వెళుతున్నారు. ఈసారి గత చరిత్రను తిరగరాసేలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు...
ఫిభ్రవరి మొదటి వారం నుంచే తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. గతంలో మార్చి నెలలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండేవి. ప్రధానంగా రామగుండం, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి జిల్లాలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ఇక మే నెలలో యాభై డిగ్రీలకు చేరుకునే అవకాశముంటుందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎండల తీవ్రత నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నం ప్రజలు చేయాలని కోరుతున్నారు.
Next Story