Tue Dec 24 2024 12:46:23 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరి ముక్క
తొలి ఏకాదశి కావడంతో.. కుటుంబమంతా కలిసి సాయంత్రం సమయంలో చిన్నారిని తీసుకుని స్థానిక ఆలయానికి వెళ్లారు. గుడికి వెళ్తే..
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయి.. ఊపిరాడక మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. గుడిలో దేవుని ప్రసాదంగా ఇచ్చే కొబ్బరి ముక్క తమ బిడ్డ ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయిన తల్లిదండ్రులు.. గుండెలవిసేలా రోధిస్తున్నారు. అప్పటి వరకూ కళ్లముందు ఆడుకుంటూ.. నవ్వుతూ తిరిగిన చిన్నారి.. ఉలుకుపలుకు లేకుండా ఉండటం చూపరులను కూడా కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ లో నివాసం ఉంటోన్న దంపతులకు మూడేళ్ల కుమారుడు జశ్వంత్ ఉన్నాడు.
గురువారం తొలి ఏకాదశి కావడంతో.. కుటుంబమంతా కలిసి సాయంత్రం సమయంలో చిన్నారిని తీసుకుని స్థానిక ఆలయానికి వెళ్లారు. గుడికి వెళ్తే.. సాధారణంగా కొబ్బరికాయ కొడతారు. వీరు కూడా గుళ్లో కొబ్బరికాయ కొట్టి, అందులోని ఓ చిన్న ముక్కను తీసి ప్రసాదంగా బాలుడికి ఇచ్చారు. బాలుడు కొబ్బరి ముక్క తింటున్న క్రమంలో అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే జశ్వంత్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. క్షణాల్లోనే తమబిడ్డ అందనిలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. కడుపుకోతతో ఆ తల్లి.. కన్నబిడ్డను పోగొట్టుకున్న ఆ తండ్రి రోధించిన తీరు అందరిచే కంటతడి పెట్టించింది. జశ్వంత్ ఆకస్మిక మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story