ఈనెల 17న కాంగ్రెస్ గూటికి 'తుమ్మల, మైనంపల్లి'!
తెలంగాణలో రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న..
తెలంగాణలో రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేసేసింది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో టికెట్ రాని అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారింది. టికెట్ దక్కని బీఆర్ఎస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్రావు కీలక అడుగులు వేస్తున్నారు. ఈనెల 17వ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుమ్మల సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తుమ్మలతో పాటు ఆయన అనుచరులు మరి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు తుమ్మల ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అప్పుడు సానుకూలంగా స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు.. తాజాగా పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాలేరు టికెట్ కోసం తుమ్మల పట్టు
కాగా, కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తుమ్మల పాలేరు నియోజకవర్గ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఎలాగైన సరే తనకు టికెట్ తప్పకుండా ఇవ్వాలంటూ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. మైనంపల్లితో ఇప్పటికే చర్చించారు.