కేసీఆర్.. ఈ దోపిడీ ఇంకెంతకాలం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అక్రమాలతో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుతింటోందన్నారు. కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం? అని ప్రశ్నించారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలు ఎంతగానో శ్రమించాయని రేవంత్ అన్నారు. ఎంతో మంది తెలంగాణ శ్రమించారని, ప్రాణ త్యాగాలు చేసి మరీ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే.. ఒక్క కేసీఆర్ కుటుంబమే గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని రేవంత్ ఆరోపణలు చేశారు. రాజకీయాలను కేసీఆర్ అవినీతిమయం చేశారని ఆరోపించారు. తెలంగాణలో తొమ్మిదేళ్ల పాలన కాలంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. ఇక ఈ తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చాయని, అప్పుతో కలిపి మొత్తం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ స్థాయిలో అమలు చేయలేదని రేవంత్ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేశాం అని చెబితే.. టీఆర్ఎస్కు ప్రజలు రెండు సార్లు అధికారం కట్టబెట్టారని.. కానీ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పరిపాలన కొనసాగించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను రాష్ట్ర ప్రజలు ఆదరించాలని ఈ సందర్బంగా రేవంత్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయన్నారు.