అప్పుడు ఎంజీఆర్.. రేపు కేసీఆర్.. అదే గతి : రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
అందరికంటే ప్రజలు తెలివైనవాళ్లు. కేసీఆర్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం. ఆ సంగతి కేసీఆర్‌కి కూడా తెలుసు.
కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పుతో సిద్ధంగా ఉన్నారని.. కేసీఆర్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని రేవంత్ అన్నారు. ఒకటికి రెండింతలు అవకాశం ఇచ్చామని ప్రజలు భావిస్తున్నారని.. కేసీఆర్ కూడా నిజాంని మించిన ఆస్తులు ఎనిమిదేళ్లలోనే వెనకేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలన ఇక చాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని.. గజ్వేల్ ఫాంహౌస్‌కి వెళ్లే సమయం దగ్గర పడిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని.. ఆ తర్వాత గులాబీ పార్టీ కనుమరుగవుతుందని టీపీసీసీ చీఫ్ అన్నారు. పార్టీ ముక్కలు ముక్కలవుతుందన్నారు. ఎన్ని ముక్కలవుతుందో కూడా చెప్పలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోగానే ఆ పార్టీ ముక్కలు ముక్కలైందని రేవంత్ గుర్తు చేశారు. ఆయన భార్య జానకి ఒక పార్టీ.. జయలలిత మరోపార్టీ ఇలా చాలా ముక్కలైందని.. టీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 సీట్లకు పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
ఓ చానల్ ఇంటర్వ్యూలో రేవంత్ తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీని పెద్దగా చూపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ట్రయాంగిల్ ఫైట్ లేనే లేదని.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ అని ఆయన తేల్చిచెప్పారు. ఇక్కడి బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని నిందిస్తుంటే.. కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి ప్రశంసలు కురిపించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారని అన్నారు. కానీ అందరి లక్ష్యం ఒక్కటేనని.. కేసీఆర్‌ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించి సూచనలు చేశామని.. మాణిక్కం ఠాగూర్ సమక్షంలో సమావేశమై చర్చించినట్లు చెప్పారు. అవన్నీ పైకి కనిపించవని.. అనవసరమైన విషయాలు ఎక్కువగా చూపుతుంటారని ఆయన అన్నారు. ఒకసారి లక్ష్యం వైపు నడవడం మొదలుపెట్టిన తర్వాత అటు, ఇటు చూడనన్నారు రేవంత్.