తెలంగాణలో మరో దోపిడీకి స్కెచ్.. WRR : రేవంత్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో దోపిడీకి స్కెచ్ వేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ రియల్ ఎస్టేట్ మాఫియాతో మరో భారీ దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ రింగ్ రోడ్డు(WRR) పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారని ఆయన అన్నారు. తన రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా విలువైన పంటలు పండే భూములు లాక్కునేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. రింగ్ రోడ్డుకి భూసేకరణ పేరుతో రైతుల నుంచి భూములు గుంజుకోనున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే గులాబీ దండు ఆ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేసిందంటూ సంచలన ట్వీట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు మింగేశారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తమ భూముల ధరలు పెంచుకునేందుకే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు తెరపైకి తెచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా వరంగల్ రింగ్ రోడ్డుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.