Sat Nov 23 2024 07:05:38 GMT+0000 (Coordinated Universal Time)
సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం : రేవంత్ పిలుపు
ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, కాంగ్రెస్ దిష్టిబొమ్మలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వబోమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో తెలంగాణలో ప్రకంపనలు సృష్టించాయి. 23వ తానా సభలకు వెళ్లిన ఆయన్ను అక్కడి ఎన్ఆర్ఐ లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ పదకాలను కొనసాగిస్తారా ? అనే ప్రశ్నకు రేవంత్ ఇచ్చిన సమాధానం తీవ్రదుమారం రేపింది. ఫలితంగా కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ పై మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది. బుధవారం రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం." అని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story