Mon Nov 18 2024 02:37:15 GMT+0000 (Coordinated Universal Time)
న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ దిశగా వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా..
2022కి వీడ్కోలు పలికి.. 2023కి స్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. నగరవాసులంతా.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకూ నగరంలోని సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
హైదరాబాద్ పరిధిలో..
ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ దిశగా వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లేందుకు వాహనాలను అనుమతించరు. ఆంక్షల సమయంలో మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేస్తారు. లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ దిశగా వెళ్లే వాహనాలను కవాడిగూడ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా దారి మళ్లిస్తారు. వాహనదారులు ఇవి గమనించి.. పోలీసులకు సహకరించాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబరు 31న నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో...
డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అవుటర్ రింగ్ రోడ్డుపై, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పైన వాహనాలు అనుమతించరు. వీటిలో ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జేఎన్ టీయూ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి శిల్పా లే అవుట్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ లెవల్ 1, లెవల్ 2, రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్, షేక్ పేట ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్ ఫ్లైఓవర్, బాలానగర్ బాబూ జగజ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ లో వాహనాలను అనుమతించరు.
కాగా.. 31వ తేదీ రాత్రి ట్యాక్సీలు, క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణించేందుకు నిరాకరించకూడదని సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరైనా డ్రైవర్ ప్రయాణానికి నిరాకరిస్తే.. 9490617346 నెంబరుకు తెలియజేయాలని సూచించారు.
Next Story