Tue Nov 05 2024 14:40:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల గుస్సా
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు.
హైదరాబాద్ : గురువారం నాడు హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ టీఆర్ఎస్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని.. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని.. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడంలేదని, యువత ఆకాంక్షలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మోదీ చిల్లర మాటలు మాట్లాడారని.. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం మోదీ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మోదీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందని.. అమిత్ షా తనయుడు ఏమైనా క్రికెట్ ఆటగాడా? ఆయన బీసీసీఐకి ఎలా కార్యదర్శి అయ్యాడు? అని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని, తెలంగాణను ఓ కుటుంబంలా భావించి పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కుటుంబం లేని వ్యక్తి మోదీ అని, ఆయనకు సెంటిమెంట్లు తెలియవని విమర్శించారు. మోదీ చరిత్రపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని, మోదీ మాటలు ఆయన పదవికి ఏమాత్రం తగవని అన్నారు. మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడమే మీ పనా? అంటూ మోదీని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో అవమానకరంగా మాట్లాడారని, మోదీ చెబుతున్న కుటుంబ పాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ది కుటుంబ పాలన కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.
Next Story