Fri Nov 22 2024 15:12:11 GMT+0000 (Coordinated Universal Time)
జాతీయ రాజకీయాల్లోకి టిఆర్ఎస్.. ఆ 13 తీర్మానాలు ఇవే !
మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం భారీ కేక్ ను..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేవలం 3 వేల మంది ప్రతినిధులకే ఆహ్వానం ఇచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసిసి లో ఆవిర్భావ ఉత్సవాలు షురూ అయ్యాయి. హైటెక్స్ లో వేడుకలకు ముందు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల సమక్షంలో తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి, పార్టీ శ్రేణులకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ 13 తీర్మానాలను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం తర్వాత ఆ తీర్మానాలను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాలతో టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఆ 13 తీర్మానాలివే !
1. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం.
2. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించేందుకు రాజకీయ తీర్మానం.
3. ఆకాశాన్ని అంటేలా ధరలను పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తీర్మానం.
4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
5. దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకుని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
6. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి.. జనగణనలో బీసీల లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం.
7. తెలంగాణలో రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్ లోనే పన్నులను వసూలు చేయాలని తీర్మానం.
9. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను నిర్ణయించి.. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇంకో తీర్మానం.
10. రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం.
11. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేసేలా డిమాండ్.
12. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్.
13. చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్.
Next Story