Mon Dec 23 2024 13:00:41 GMT+0000 (Coordinated Universal Time)
టీఎస్ఆర్టీసీకి కర్ణాటక డీజిల్.. పోలీసులకు ఫిర్యాదు !
నారాయణఖేడ్, జహీరాబాద్ డిపో మేనేజర్లు బీదర్, సమీప ప్రాంతాల్లోని బంకుల నుంచి డీజిల్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు రోజువారీ ధరల పెరుగుదల ఆగినప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలకు పైగానే ఉంది. తెలంగాణలో లీటరు పెట్రోలు ధర రూ.119.47, డీజిల్ ధర రూ. 106.76కు పెరగడంతో.. వాహనదారులు అల్లాడిపోతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీకి ఇంధనం కొనుగోలు పెద్దభారంగా మారింది. బల్త్ డీజిల్ ధరపై కేంద్రం ఒక్కసారిగా రూ.25 పెంచడంతో ఆర్టీసీ సంస్థపై మరింత భారం పెరిగింది. దాంతో ఎక్కడ ఇంధనం తక్కువ ధరకు వస్తే.. అక్కడి నుంచే కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు సూచించింది.
ఆర్టీసీ సూచన మేరకు.. సరిహద్దుల్లోని డిపో మేనేజర్లు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక బంకుల నుంచి డీజిల్ కొనుగోళ్లు షురూ చేశారు. కర్ణాటకలో బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించడంతో లీటరు డీజిల్ ధర రూ.95.57 గా ఉంది. కర్ణాటకతో పోలిస్తే.. తెలంగాణలో డీజిల్ ధర రూ.11.19 ఎక్కువగా ఉంది. దాంతో నారాయణఖేడ్, జహీరాబాద్ డిపో మేనేజర్లు బీదర్, సమీప ప్రాంతాల్లోని బంకుల నుంచి డీజిల్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలో మాదిరి.. అన్ని రాష్ట్రాల్లోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను తగ్గిస్తే తెలంగాణ ఆర్టీసీకి ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు డిపో మేనేజర్లు.
కేంద్రం మోపిన డీజిల్ భారాన్ని మోయలేక.. మంగళవారం బీదర్ నుంచి డీజిల్ ట్యాంకర్ ను కొనుగోలు చేశారు నారాయణఖేడ్ డిపో అధికారులు. నారాయణఖేడ్ కు చెందిన ఓ డిపో యజమాని.. పక్కరాష్ట్రం నుంచి అక్రమంగా డీజిల్ ను తెచ్చి అమ్ముతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద పోలీసులు డీజిల్ ట్యాంకర్ ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు పరిస్థితిని వివరించి డీజిల్ ట్యాంకర్ ను తీసుకెళ్లారు. కాగా.. టీఎస్ఆర్టీసీ డీజిల్ ట్యాంకర్ ను పోలీసులు ఆపడంపై సంస్థ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తామేమీ అక్రమంగా డీజిల్ ను అమ్ముకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పీఎం మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను తగ్గిస్తే.. వాహనదారులకు ఉపశమనం ఉంటుందని సూచించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను పెంచలేదని, ఒక్కసారి రౌండాఫ్ చేశామని స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ పై దుమ్మెత్తి పోస్తున్నా.. మరోవైపు కర్ణాటక నుంచి టీఎస్ఆర్టీసీ డీజిల్ ను కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
Next Story