Sun Dec 22 2024 22:53:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. ఎవరి పనై ఉంటుంది ?
గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం లోని బస్టాండ్ ఆవరణలో జరిగింది.
గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జరిగింది. బస్ స్టేషన్ లో నైట్ హాల్ట్ గా ఉన్న ములుగు డిపోకు చెందిన బస్సు తెల్లవారుజామున తిరిగి బయల్దేరి వెళ్తుంది. నైట్ హాల్ట్ చేసిన ఈ బస్సు వెనుక భాగంలో అర్థరాత్రి సమయంలో దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా తగులబడింది. బస్సు వెనుక నుంచి మంటలు చెలరేగడంతో.. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే బస్సు వెనుక భాగం, ఒక చక్రం, బస్సులోని కొన్ని సీట్లు కాలిపోయాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
మావోయిస్టులేనా?
కాగా.. ఆ ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులే బస్సుకు నిప్పు పెట్టి ఉంటారా ? లేక ఎవరైనా ఆకతాయిలు చేసి ఉంటారా ? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మావోయిస్టుల పనే అయితే.. అక్కడ ఒక లేఖ అయినా ఉండాలి కదా. అలాంటివేమీ లేకపోవడంతో ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని ప్రయాణికులు సందేహం వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతానికి వచ్చిన పోలీసులు.. బస్సును పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story