Mon Dec 23 2024 08:56:11 GMT+0000 (Coordinated Universal Time)
రైతులు ఇంత మంది ఎందుకు చనిపోతున్నారు?
తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఆమె మూడో రోజు పర్యటించారు. గాంధారి గ్రామంలో ఆమె రైతులతో సమావేశమయ్యారు. రైతులకు మంచి చేస్తుంటే ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. 2017 -2019 మధ్య కాలంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 17 వేల కోట్ల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నారు. వంద మందిలో ఐదుగురికి మాత్రమే మాఫీ చేశారన్నారు.
రాజకీయాలు చేయొద్దు....
తెలంగాణకు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ 7,658 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చామని తెలిపారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని చెబుతుండటం అబద్ధమని తెలిపారు. రైతుల విషయంలో ఎవరూ రాజకీయాలు ఎవరూ చేయడానికి వీలు లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. రైతులను మోదీ కంటే ఎవరూ గౌరవించే వారు లేరన్నారు. రైతుల కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు కొందరు విపరీతార్థాలు తీస్తున్నారన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలయ్యే పథకాల్లో మోదీ ఫొటోను ఖచ్చితంగా పెట్టాలని ఆమె అధికారులను మరో సారి ఆదేశించారు.
Next Story