Sun Dec 22 2024 13:32:27 GMT+0000 (Coordinated Universal Time)
మూసీ పేరిట మరో అవినీతికి తెర : బండి సంజయ్
మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తు్ందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంది. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైందన్నారు. గత పాలకులు చేసిన దాదాపు ఆరు లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే 60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తోందని బండి సంజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే నానా తంటాలు పడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో...
ఈ డబ్బుల్లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలోకొట్టుమిట్టాడుతోందని బండి సంజయ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో మరో లక్షన్నర కోట్ల రూపాయల మేరకు అప్పు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని తెలిపారు. ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప మూసీ పరిస్థితి ఏ మాత్రం మారలేదని బండి సంజయ్ అన్నారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ‘మూసీ పునరుజ్జీవం’ పేరుతో మరో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండటం బాధాకరమని బండి సంజయ్ అన్నారు.
Next Story