Tue Nov 05 2024 16:21:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో దారుణం.. వీధికుక్కల దాడిలో మరో బాలుడి మృతి
ఉదయం నిద్రలేవగానే చోటూ.. పక్కనే ఉన్న పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఆరు వీధికుక్కలు..
తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ లో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీత , మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు కొడుకు చోటూ (8)తో కాజీపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సంచార నివాసితులుగా ఉండే వీరు.. వంట చేసుకునేందుకై గురువారం (మే18) రాత్రి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పార్కుకు వెళ్లారు.
ఉదయం నిద్రలేవగానే చోటూ.. పక్కనే ఉన్న పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఆరు వీధికుక్కలు బాలుడిపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో.. చెట్టుకొమ్మకు షర్టు చిక్కుకుంది. దాంతో ఎటూ కదల్లేక కింద పడిపోయాడు. ఎంత కేకలు పెట్టినా ఎవరికీ వినిపించలేదు. దాదాపు 15 నిమిషాల పాటు వీధికుక్కలు చోటూపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరచడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీధికుక్కల దాడిలో కొడుకు మరణించడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. నాలుగురోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ బాలికపై, 10 రోజుల క్రితం రైల్వే ఉద్యోగి పై కూడా దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story