గ్రీన్ ట్యాక్స్ ను పెంచేసిన తెలంగాణ ప్రభుత్వం
. రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచుతూ.. శ్లాబులవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం.

హైదరాబాద్ : పెరుగుతున్న ఇంధన ధరలను చూసి వాహనాల యజమానులు ఇప్పటికే గగ్గోలు పెడుతూ ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 'గ్రీన్ ట్యాక్స్' ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆయా కేటగిరీలకు చెందిన వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహనాలకు నామమాత్రంగా గ్రీన్‌ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని శ్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్లు, 10 నుంచి 12 ఏళ్లు, 12 ఏళ్లు దాటినవి.. ఇలా 3 శ్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తోంది. రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచుతూ.. శ్లాబులవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం. గ్రీన్ ట్యాక్స్, క్వాటర్లీ ట్యాక్స్ పెంచింది రవాణా శాఖ.
అధికారికంగా జీవో ఇంకా విడుదల చేయకపోయినా రవాణా శాఖ స్లాట్ బుకింగ్‌లో మాత్రం ఇప్పటికే అప్లోడ్ చేసింది. 15 ఏళ్లు దాటిన కమర్షియల్ బండ్లకు కండీషన్, పిట్నెస్ మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తూ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నాయి. ఏడేళ్లు దాటిన కమర్షియల్ వెహికిల్స్‌కు 200 రూపాయలు, 15 ఏళ్లు నిండిన నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌కు ఏటా 200 రూపాయలు, ఇలా వాహనాలను బట్టి గ్రీన్ ట్యాక్స్‌ను రెండు స్లాబుల్లో చెల్లించే వారు. తాజాగా రవాణా శాఖ దీన్ని మూడు స్లాబులుగా చేసింది. ఇక క్వాటర్లీ ట్యాక్స్‌లో 20 శాతం పెంచింది రవాణా శాఖ. లారీలు, ట్రావెల్స్‌పై 20 శాతం ట్యాక్స్ పెంచారు. ట్రావెల్ వాహనాలకు సీట్లను బట్టి ట్యాక్స్‌లు విధిస్తారు.

