Mon Dec 23 2024 09:46:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈ భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులు ఉండనున్నాయంటే?
తెలంగాణలో అధికారులు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో నిర్వహించిన
హైదరాబాద్ నగరంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్లో గత కొద్దిరోజుల నుండి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు హైదరాబాద్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెడ్ అలర్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యవసరమైతేనే ఇండ్లలో నుండి బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు.
తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో అతి భారీ వర్షం పైన అధికారులు అప్రమత్తం చేసారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో అధికారులు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే గోదావరి బేసిన్ లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయని.. రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముందన్నారు. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లను వెంటనే మరమ్మతులు జరపాలని ఆదేశించారు. జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో NDR దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలన్నారు.
Next Story