Sun Mar 16 2025 12:44:15 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : పన్నెండో రోజుకు చేరినా కనిపించని కార్మికుల జాడ
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఇంతవరకూ ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఇంతవరకూ ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. పన్నెండో రోజుకు చేరుకున్నా కార్మికుల జాడ కనిపించక పోవడంతో మరింత ఆందోళన మొదలయింది. సహాయక చర్యలు వేగవంతం చేసినప్పటికీ ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు ఆటంకంగా మారనుంది. బురదను తొలగించే ప్రక్రియ కూడా వేగవంతంగా సాగడం లేదు. దీంతో ఎప్పుడు ఆపరేషన్ ఎస్.ఎల్.బి.సి పూర్తవుతుందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. దాదాపు పదకొండు బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేుద.
కన్వేయర్ బెల్ట్ మాత్రం...
అయితే కొంతలో కొంత ఊరట కలిగించే విషయమేంటంటే టన్నెల్ లో కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. దీంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. టన్నెల్ లో దాదాపు ఐదు వేట టన్నుల మట్టి పేరుకుపోయి ఉండటంతో దానిని తొలగించడం సహాయక బృందాలకు ఆటంకంగా మారింది. మట్టిని తొలగిస్తేనే కానీ కార్మికుల జాడ తెలిసే అవకాశం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి.
బంధువుల నిరీక్షణ...
అయితే కన్వేయర్ బెల్టు పూర్తయినా రోజుకు ఎనిమిది వందల టన్నుల మట్టిని మాత్రమే బయటకు తేగలిగే అవకాశముందని చెబుతున్నారు. దీన్ని బట్టి మరికొన్ని రోజులు మట్టిని తొలగించే ప్రక్రియ పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తప్పి పోయిన కార్మికులు ఎక్కువ మంది బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు కావడంతో వారి బంధువులు గత కొద్ది రోజులుగా టన్నెల్ బయటే నిరీక్షిస్తున్నారు. తమ వారి ఆచూకీ లభిస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వారి జాడ కనిపించకపోవడంతో వారిలోనూ ఇక కార్మికులు జీవించి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. తప్పిపోయిన వారిలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారని చెబుతున్నారు.
Next Story